ఆలేరు (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 30
భారతదేశానికి హిమాలయాలు కేవలం మంచుకొండలు కాదని, అవి దేశానికి సహజ కవచాలు, నదులకు జీవనధారలు, వాతావరణానికి సమతుల్యాలు, భారత భూభాగానికి ప్రకృతి ప్రసాదించిన ప్రాణాధారాలని ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీమతి మంజుల పత్తిపాటి అన్నారు. హిమాలయాల పరిరక్షణపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
భారతదేశానికి హిమాలయాలు కేవలం మంచుకొండలు కాదని, అవి దేశానికి సహజ కవచాలు, నదులకు జీవనధారలు, వాతావరణానికి సమతుల్యాలు, భారత భూభాగానికి ప్రకృతి ప్రసాదించిన ప్రాణాధారాలని ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీమతి మంజుల పత్తిపాటి అన్నారు. మనం చూస్తున్న హిమాలయాలు కేవలం పర్యాటక ప్రదేశాలు కాదని, తరతరాల భవిష్యత్తుకు ప్రకృతి రాసిన భద్రతా పుటలని ఆమె పేర్కొన్నారు.
మనకు రక్షణ కవచంలా ఉన్న హిమాలయాల ఒడిలోకి వెళ్లి, వినోదం పేరుతో విచ్చలవిడిగా ప్రకృతి ఒడిని చెరిపేసి ప్రమాదాన్ని మనమే కొనితెచ్చుకుంటున్నామని మంజుల పత్తిపాటి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని ప్రకృతి చెబుతున్నా, మనం చెవిటివారిలా నటిస్తూ చోద్యం చూస్తున్నామని ఆమె విమర్శించారు.
హిమశిఖరాలు కరుగుతున్నాయంటే మనకు అది హెచ్చరిక కాదా అని ప్రశ్నించారు. ప్రకృతి కన్నెర్ర చేస్తున్నా కనీసం సోయి ఉందా అని ఆమె మండిపడ్డారు. నేపాల్లో నేడు ప్రకృతి ప్రకంపన వస్తే, రేపు మన వంతు ఈ విధ్వంస వేదన తప్పదని హెచ్చరించారు.
అందుకే ఇకనైనా మేల్కొందామని, మొక్కలను నాటుదామని, అడవులను కాపాడుదామని, హిమాన్ని కాపాడుదామని, భావితరాలకు కానుకగా ఇద్దామని ఆమె పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె తన అభిప్రాయాలను, సూచనలను తెలియజేశారు.












