హైదరాబాద్, జులై 01
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 1.06 కోట్ల రేషన్ కార్డుదారుల కుటుంబాలకు జులై నెలకు సంబంధించిన ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. సుమారు 3.41 కోట్ల మంది లబ్ధిదారులకు దీనివల్ల ప్రయోజనం చేకూరనుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 1.06 కోట్ల రేషన్ కార్డుదారుల కుటుంబాలకు జులై నెలకు సంబంధించిన ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 3.41 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రతి నెలా లాగే ఈసారి కూడా ఎలాంటి జాప్యం లేకుండా, లబ్ధిదారులకు సకాలంలో బియ్యాన్ని అందించేందుకు వీలుగా మొత్తం 2.15 లక్షల టన్నుల బియ్యాన్ని ఇప్పటికే అన్ని చౌకధరల దుకాణాలకు పౌరసరఫరాల శాఖ అధికారులు తరలించారు.
లబ్ధిదారులకు రేషన్ కోసం ఎదురుచూసే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో పౌరసరఫరాల శాఖ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జులై నెలకు అవసరమైన 2.15 లక్షల టన్నుల బఫర్ స్టాక్‌ను గడువు కంటే ముందే గ్రామ, వార్డు స్థాయిలోని రేషన్ దుకాణాలకు విజయవంతంగా చేరవేసింది.
దీనివల్ల నెల ప్రారంభమైన మొదటి రోజు నుంచే కార్డుదారులు ఎటువంటి నిరీక్షణ లేకుండా.. తమకు కేటాయించిన బియ్యాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా పొందే అవకాశం ఏర్పడింది. సరుకుల కొరత లేకుండా చూడటమే లక్ష్యంగా అధికారులు ఈ ముందస్తు బఫర్ నిల్వలను ఏర్పాటు చేశారు.
గతంలో యాసంగి సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు భారీ ఎత్తున జరగడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ గోదాముల్లో నిల్వ సామర్థ్యం, స్థల లభ్యత సమస్య తీవ్రంగా మారింది. ఎఫ్ సీ ఐ నిబంధనల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ సమస్యను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది.
మూడు నెలలు ఏప్రిల్, మే, జూన్ కోటాను ఏకకాలంలో పంపిణీ చేయాలని కేంద్రం సూచించడంతో పౌరసరఫరాల శాఖ ఏప్రిల్ నెలలోనే లబ్ధిదారులకు మూడు నెలల సన్నబియ్యాన్ని ఒకేసారి అందించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన 6.43 లక్షల టన్నుల కోటాలో రికార్డు స్థాయిలో 95 శాతం అంటే 6.08 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసింది.
ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అవకతవకలకు చెక్ పెట్టేందుకు పౌరసరఫరాల శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. బియ్యం పంపిణీ ప్రక్రియ ఎక్కడ ఎలాంటి లోపాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా సమర్థంగా నిర్వహించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారం సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.












