Nalgonda/Kanagal (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 05
కొత్త రాజకీయ పార్టీతో తెలంగాణలో సత్తా చాటాలని భావించిన కవితకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ అనే పేరుపై అభ్యంతరాలు రావడంతో ఆ పార్టీ పేరును కేటాయించలేమని ఈసీ ఆమెకు లేఖ రాసింది. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాలని ఆదేశించింది.
కొత్త రాజకీయ పార్టీతో అధికార, ప్రతిపక్ష పార్టీలతో సమానంగా తెలంగాణలో సత్తా చాటాలని భావించిన కవితకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) భారీ షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ అనే పేరుపై అభ్యంతరాలు రావడంతో ఆ పార్టీ పేరును కేటాయించలేమని ఈసీ ఆమెకు లేఖ రాసింది. ఆ లేఖకు కవిత సమాధానం కూడా ఇచ్చినట్లు తెలిసింది.
ప్రజలకు, ఉద్యమకారులకు టీఆర్ఎస్ అన్న పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ, ఇప్పుడు అదే పేరు చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితిగా మారడంతో ప్రస్తుతం టీఆర్ఎస్ టైటిల్ దక్కించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అందులో భాగంగానే కల్వకుంట్ల కవిత తన పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన అంటూ, టీఆర్ఎస్ అర్ధం వచ్చేలా ప్రకటించారు. కానీ, ఆ జోరుకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేకులేసింది. తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరు మార్చి తీరాల్సిందేనంటూ తాజాగా కవితకు ఈసీ లేఖ రాసింది. టీఆర్ఎస్ పేరుపై ఇప్పటికి వెయ్యికి పైగా అభ్యంతరాలు రావడంతో దాన్ని పక్కనపెట్టి, 15 రోజుల్లోగా 3 ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని ఈసీ నుంచి కవితకు సమాచారం అందింది.
వాస్తవానికి కొత్తగా పార్టీ పేరు రిజిస్టర్ చేసే సమయంలో చాలా ప్రాసెస్ ఉంటుంది. కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించాలి. అప్పటికే ఉన్న పార్టీల పేరు రాకుండా, లేదంటే షార్ట్ ఫామ్లో ఒకేలా ధ్వనించకుండా జాగ్రత్తపడాలి. అలా చేయకుంటే అభ్యంతరాలు వచ్చినప్పుడు ఆగిపోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కవిత తెలంగాణ రక్షణ సేన విషయంలో కూడా అదే జరిగింది.
గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిని షార్ట్ ఫామ్లో టీఆర్ఎస్ అని పిలిచేవారు. ఇప్పుడు కవిత పార్టీకి కూడా షార్ట్ఫామ్లో అదే సౌండ్ వస్తోంది. ఇదే విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కవిత వెనక్కి తగ్గకుండా కోర్టుకు వెళ్తామని ప్రకటించడంతో ఈ సమస్య కాస్త ఉత్కంఠగా మారింది.












