సూళ్ళూరుపేట (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 01
తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలో గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 21వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటనలో, నిందితులు బాధితుడిని మద్యం తాగించి, రాయితో, బీర్ బాటిల్‌తో దాడి చేసి చంపేసినట్లు తెలిపారు.
తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలో జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 21వ తేదీ రాత్రి సుమారు 9:30 గంటలకు నిధి వైన్ షాప్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న గుర్తు తెలియని వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఆ వ్యక్తిని తమ మోటార్ సైకిల్‌పై కెఆర్‌పి వెహికల్ గ్యారేజ్ వెనుక మణిదీప్ లేఅవుట్స్ ప్రాంతానికి తీసుకెళ్లారు.
అక్కడ అతనికి బలవంతంగా మద్యం తాగించి, గొడవ పెట్టుకుని, రాయితో ముఖంపై, బీర్ బాటిల్‌తో మెడపై దాడి చేశారు. ఈ దాడిలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి చేతికి ఉన్న వాచ్‌ను నిందితులు అపహరించారు. అనంతరం, మృతదేహాన్ని, దాడికి ఉపయోగించిన రాయిని సమీపంలోని బురద మడుగులో పడేశారు.
మృతుడి బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో బట్టలు, టిఫిన్ బాక్స్, రూ.200 నగదు ఉన్నట్లు గుర్తించారు. నిందితులు నగదును తీసుకుని, మిగిలిన వస్తువులతో మన్నే ముత్తరి గ్రామ రోడ్డులోని కోళ్ళమిట్ట స్మశానవాటిక వద్దకు వెళ్లి బ్యాగ్‌ను తగలబెట్టి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, డిఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టారు.
సూళ్ళూరుపేట సీఐ మురళీకృష్ణ, ఎస్సై అజయ్ కుమార్, సిబ్బందితో కలిసి కేసును అత్యంత చాకచక్యంగా దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా సేకరించిన ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితులను గుర్తించి, ఈ నెల 31న అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మృతుడి వాచ్, రూ.200 నగదు, బీర్ బాటిల్, రాయిని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.












