షాద్‌నగర్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 02
షాద్‌నగర్ శివారులోగల సర్వే నంబర్ 364లో ఉన్న బీరప్ప, యెల్లమ్మ, మహంకాళి దేవాలయాలను ధ్వంసం చేసిన ఘటనపై షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సురేష్ కుమార్ అగర్వాల్‌కు చెందిన వ్యవసాయ భూమిలో ఉన్న ఈ దేవాలయాలను తొలగించబోమని హామీ ఇచ్చినా, కొద్దికాలం క్రితం పునర్నిర్మాణ పనులు అడ్డుకుని, ఇటీవల పునాదులను, చిన్న బీరప్ప ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు అందింది.
షాద్‌నగర్ పట్టణ శివారులోని ఫరూఖ్‌నగర్ రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్ 364లో ఉన్న బీరప్ప, యెల్లమ్మ, మహంకాళి దేవాలయాల ధ్వంసం ఘటనపై షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారు సంగాపురం లింగమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు, 1983లో కొనుగోలు చేసిన సుమారు 10.37 ఎకరాల వ్యవసాయ భూమిలో తమ సామాజిక వర్గానికి చెందిన దేవాలయాలు ఎన్నో ఏళ్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2009లో భూమిని హైదరాబాద్‌కు చెందిన సురేష్ కుమార్ అగర్వాల్‌కు విక్రయించినప్పటికీ, దేవాలయాలను తొలగించబోమని కొనుగోలుదారు అప్పట్లో హామీ ఇచ్చినట్లు తెలిపారు.
సుమారు ఏడాది క్రితం దేవాలయాల పునర్నిర్మాణ పనులు ప్రారంభించగా, సీఎస్కే సంస్థ సిబ్బంది రోనక్ తదితరులు పనులను అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై 31న బోనాల పండుగ నిర్వహించిన అనంతరం, ఆగస్టు 1న మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో నంబర్ ప్లేట్ లేని జేసీబీతో కొత్తగా వేసిన పునాదులను కూల్చివేయడంతో పాటు చిన్న బీరప్ప ఆలయాన్ని కూడా ధ్వంసం చేసినట్లు ఆరోపించారు. నిర్మాణ సామగ్రిని కూడా అక్కడి నుంచి తరలించినట్లు తెలిపారు.
పోలీసుల విచారణలో జేసీబీని నడిపిన వ్యక్తి ఇబ్రహీం అని గుర్తించినట్లు, ఈ పని మిన్నయ్య, రోనక్ ఆదేశాల మేరకు జరిగిందని వెల్లడించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై షాద్‌నగర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 298, 324(2), 3(5) కింద క్రైమ్ నంబర్ 656/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తును షాద్‌నగర్ పట్టణ సీఐ రత్నాక్ నాయక్ పర్యవేక్షణలో కొనసాగిస్తున్నారు.












