Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 31
బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులో ఇంటి పనివాడే సూత్రధారిగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 1.4 కిలోల వెండి, 15 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఈ కేసును ఛేదించాయి.
బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.4 కిలోల వెండి ఆభరణాలు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు బోథ్ సీఐ డి. గురుస్వామి తెలిపారు.
సోనాల మండలం సూర్యనగర్ (సఖేరా) గ్రామానికి చెందిన ధరావత్ వినోద్ కుమార్ ఈ నెల 26న తన తల్లిని తీసుకురావడానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్లే ముందు ఇంటికి తాళం వేసి, బంగారం, వెండి ఆభరణాలు, నగదును ట్రంకు పెట్టెలో భద్రపరిచారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇంటి పనివాడు అర్జున్ ఆడే (A2) తన పరిచయస్తుడు రథోడ్ గణేష్ (A1)తో కలిసి దొంగతనానికి పథకం రచించాడు. రాత్రి సమయంలో గణేష్ ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి 1.4 కిలోల వెండి ఆభరణాలు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,000 నగదు అపహరించగా, అర్జున్ బయట కాపలా కాశాడు. అనంతరం దొంగిలించిన సొత్తును ఇద్దరూ పంచుకున్నారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి, సాంకేతిక ఆధారాలు మరియు విశ్వసనీయ సమాచారంతో నిందితులను గుర్తించి, చోరీ సొత్తుతో పరారయ్యే ప్రయత్నంలో అదుపులోకి తీసుకున్నాయి. వారి వద్ద నుంచి మొత్తం చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సీఐ డి. గురుస్వామి మాట్లాడుతూ, ప్రజలు ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో విలువైన వస్తువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్-112కు సమాచారం అందించాలని సూచించారు.
కేసును వేగంగా ఛేదించిన ఎస్ఐ వి. పురుషోత్తం, పోలీసు సిబ్బంది మదన్, హఫీజ్, రాహుల్, సంతోష్లను సీఐ అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఐ వి. పురుషోత్తం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.












