మిర్యాలగూడ, జూలై 29
సివిల్ కోర్టులో ఆస్తి వివాదం పెండింగ్‌లో ఉండగానే, మిర్యాలగూడ-2 టౌన్ ఎస్ఐ జోక్యం చేసుకుని తనను, కుటుంబాన్ని బెదిరించి రాజీకి ఒత్తిడి తెచ్చారని ఆరోపిస్తూ దాసరాజు పద్మ నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని ఆమె వినతి చేశారు.
సివిల్ కోర్టులో ఆస్తి వివాదం పెండింగ్‌లో ఉన్నప్పటికీ, మిర్యాలగూడ-2 టౌన్ ఎస్ఐ ఆంజనేయులు సివిల్ వివాదంలో జోక్యం చేసుకుని తనను, తన కుటుంబ సభ్యులను బెదిరించి రాజీకి ఒత్తిడి తెచ్చారని ఆరోపిస్తూ దాసరాజు పద్మ నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌కు ఫిర్యాదు చేశారు.
బుధవారం ఆమె కుమారుడు దాసరాజు శ్యాంసుందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సివిల్ వివాదానికి సంబంధించి కోర్టులో కేసు విచారణలో ఉన్నప్పటికీ పోలీసులు ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.
మిర్యాలగూడ పట్టణ పరిధిలోని సర్వే నంబర్ 945లో ఉన్న భూమికి సంబంధించి తనకు, ప్రతివాదులకు మధ్య ఆస్తి వివాదం కొనసాగుతోందని, ఈ విషయంపై మిర్యాలగూడ సివిల్ కోర్టులో ఓ.ఎస్. నంబర్ 20/2026 కేసు ప్రస్తుతం విచారణలో ఉందని తెలిపారు.
భూమి హక్కులు, యాజమాన్యం, స్వాధీనానికి సంబంధించిన అంశాలను సివిల్ కోర్టు పరిధిలోనే పరిష్కరించాల్సి ఉండగా, పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. తన భూమిలోకి ఎలాంటి చట్టబద్ధమైన అనుమతి లేకుండా ప్రవేశించి, తనను, కుటుంబ సభ్యులను తీవ్ర పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు గురిచేసి అవమానించారని వెల్లడించారు.
రాత్రివేళ తనను, కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి గంటల తరబడి నిలబెట్టి మానసిక వేదనకు, అవమానానికి గురిచేశారని తెలిపారు.
సివిల్ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో పోలీసుల జోక్యంపై విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై తగిన శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఎస్పీ శరత్చంద్ర పవార్‌ను కోరినట్లు వెల్లడించారు.
కాగా, ఈ విషయంపై టూటౌన్ సీఐ సోమ నరసయ్య మాట్లాడుతూ, సదరు వ్యక్తులపై పలు పోలీస్ స్టేషన్లలో భూకబ్జా కేసులు నమోదు అయి ఉన్నాయని, ఇదంతా తప్పుడు ప్రచారం అని తెలిపారు.











