కరీంనగర్, జూలై 31
కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన దొంగతనం కేసులో పోలీసుల దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడైన తగరం శంకర్ లాల్‌తో సంబంధం ఉన్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె రూ.26 లక్షల నగదు అపహరణలో తన ప్రమేయాన్ని అంగీకరించింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దొంగతనం కేసులో ప్రధాన నిందితుడైన జడ్పీటీసీ భర్త తగరం శంకర్ లాల్‌ను ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, గురువారం మధ్యాహ్నం మరో ట్విస్టు చోటుచేసుకుంది. సుమారు 3.30 గంటల సమయంలో, కరీంనగర్ రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డికి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, ఆయన సిబ్బందితో కలిసి తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లి అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో ఆమె తన పేరు ఆడెపు రేష్మా, కేశవపట్నం మండలం చింతగుట్టపల్లి గ్రామానికి చెందిన దానినిగా, అలాగే ఈ కేసులో మొదటి నిందితుడైన తగరం శంకర్‌కు సన్నిహితురాలినిగా తెలిపింది. నిన్న తగరం శంకర్‌ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేయగా, తనను కూడా పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో బంధువుల ఇంటికి వెళ్లేందుకు చంద్రాపూర్‌కు వెళ్లే రైలు కోసం తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్లో వేచి ఉండగా పోలీసులు పట్టుకున్నారని ఆమె తెలిపింది.
తదుపరి విచారణలో, దొంగతనం జరిగిన రోజున తాను కూడా తగరం శంకర్‌తో కలిసి తీగలగుట్టపల్లిలోని ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ ఇంటిలోకి ప్రవేశించి, ఇంటి తాళాలు పగులగొట్టి, అనంతరం బాత్రూమ్ తాళం కూడా పగులగొట్టి, అక్కడ ప్లాస్టిక్ నీళ్ల ఖాళీ డ్రమ్ములో దాచిపెట్టిన సుమారు రూ.26 లక్షల నగదును అపహరించినట్లు అంగీకరించింది. దొంగిలించిన డబ్బులో తనకు కూడా కొంత వాటా ఇస్తానని తగరం శంకర్ చెప్పినప్పటికీ, అనంతరం అతడు తన స్వగ్రామానికి వెళ్లిపోయాడని, డబ్బు పంపిస్తానని చెప్పి పంపలేదని, తాను ఎదురుచూస్తుండగా అతడిని పోలీసులు అరెస్టు చేశారని ఆమె తెలిపింది.
తగరం శంకర్‌తో తాను నిరంతరం మాట్లాడేందుకు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను కూడా పంచుల సమక్షంలో స్వచ్ఛందంగా చూపించి అప్పగించింది. తన ప్రమేయాన్ని పూర్తిగా అంగీకరించడంతో, పంచనామా నిర్వహించి, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి, రిమాండ్ నిమిత్తం గురువారం న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మిగిలిన అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపారు.












