Hyderabad/Shaikpet (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న షాద్నగర్ పట్టణ చౌరస్తా విస్తరణ పనులకు ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవతో సోమవారం ప్రారంభమైన ఈ పనుల ద్వారా, రోడ్డుకు ఇరువైపులా 50 అడుగుల పరిధిలో ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. వాహనదారుల నిరీక్షణకు తెరపడటంతో పాటు, రహదారి విస్తరణ కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరి కాంక్ష నెరవేరింది.
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న షాద్నగర్ పట్టణ చౌరస్తా విస్తరణ పనులకు ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు. వాహనదారుల నిరీక్షణకు తెరపడటంతో పాటు, రహదారి విస్తరణ కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరి కాంక్ష నెరవేరింది. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవతో చౌరస్తా విస్తరణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి.
ఆర్డీవో సరిత, ఏసీపీ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ సునీతారెడ్డి, మండల తహసిల్దార్ నాగయ్య, సిఐ సీతారాం ఆధ్వర్యంలో అధికారులు, పోలీసులు విస్తరణ పనులను చేపట్టారు. మున్సిపల్, పోలీసు, రెవెన్యూ, విద్యుత్తు, ఆర్ అండ్ బి తదితర శాఖలకు చెందిన అధికారులు ఈ కూల్చివేతల కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక పరిగి రోడ్డులోని పోచమ్మ ఆలయం నుంచి విస్తరణ పనులను ప్రారంభించారు.
జేసీబీల సహాయంతో రోడ్డుకు ఇరువైపులా 50 అడుగుల పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. పట్టణంలోని నలువైపులా ఉన్న ఆక్రమణలను దశలవారీగా తొలగిస్తూ, చివరగా ప్రధాన పట్టణ కూడలిలోని ఆక్రమణలను కూడా తొలగించి చౌరస్తాను విస్తరించాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు.
విస్తరణ పనులకు శ్రీకారం చుట్టడంతో పలువురు వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరిస్తూ తమ దుకాణాల ముందు ఉన్న ఆక్రమణలను తొలగించుకుంటున్నారు. అయితే మరికొందరు వ్యాపారులు తమకు కొంత సమయం ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు. అందరి సహకారంతో విస్తరణ పనులను పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు.
చౌరస్తా విస్తరణ పనులు ప్రారంభం కావడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కల ఇప్పుడు నెరవేరుతోందని, చౌరస్తా విస్తరణ పూర్తయితే పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
షాద్నగర్ పట్టణ కూడలిని విస్తరించాలనే లక్ష్యం ఈనాటిది కాదు. షాద్నగర్ జాతీయ రహదారి బైపాస్ ఏర్పాటు చేసినప్పటి నుంచే పట్టణ కూడలి విస్తరణపై ప్రతిపాదనలు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యే శంకర్రావు పట్టణ కూడలి విస్తరణతో పాటు పట్టణం మీదుగా ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినప్పటికీ, అప్పట్లో వ్యాపారులు అంగీకరించకపోవడంతో ఆ ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. అనంతరం గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కూడా కొత్తూరు నుంచి షాద్నగర్ వరకు పాత జాతీయ రహదారి విస్తరణ సమయంలో పట్టణ కూడలి విస్తరణ ప్రతిపాదనను తెచ్చారు. అయితే వ్యాపారుల అభ్యంతరాలతో ఆ ప్రతిపాదన కూడా కార్యరూపం దాల్చలేదు. పట్టణ కూడలి నుంచి అన్నారం వరకు రహదారి పనులు పూర్తికాకపోవడానికి కూడా ఈ సమస్య ఒక కారణంగా మారింది.












