సారంగాపూర్ మండల కేంద్రంలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతూ, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ కూచాడి శ్రీహరి రావుకు స్థానిక ఎస్సీ మహిళలు వినతిపత్రం అందజేశారు.
మండల కేంద్రంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం అత్యవసరమని, ఇది సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళల సమావేశాలు మరియు వివిధ సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతుందని మహిళలు తెలిపారు. ప్రస్తుతం కమ్యూనిటీ హాల్ లేకపోవడం వల్ల పలు కార్యక్రమాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు.
ఈ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, హాల్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టేలా సహకరించాలని వారు కోరారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయితే, ఎస్సీ వర్గాల ప్రజలకు ఒక వేదిక లభించడమే కాకుండా, సామాజిక కార్యకలాపాలు మరింత మెరుగుపడతాయని ఆశభావం వ్యక్తం చేస్తున్నారు.
వినతిని స్వీకరించిన శ్రీ కూచాడి శ్రీహరి రావు, సమస్యను పరిశీలించి, ప్రభుత్వం మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంలో సానుకూల ఫలితాలు వచ్చేలా చూస్తానని ఆయన భరోసా కల్పించారు.
ఈ హామీతో ఎస్సీ మహిళలు సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తవుతుందని ఆశిస్తున్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.












