ప్రొద్దుటూరు, జూన్ 01
ప్రొద్దుటూరులో బంధువులు లేని ఇద్దరు వ్యక్తుల మృతదేహాలకు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్యంతో మృతి చెందిన షేక్ రసూల్, గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఫౌండేషన్ ముందుకు వచ్చింది.
మానవత్వమే తమ సేవా ధ్యేయంగా ముందుకు సాగుతున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ మరోసారి తమ సేవా భావాన్ని చాటుకుంది. ప్రొద్దుటూరు బొల్లవరం ప్రాంతానికి చెందిన షేక్ రసూల్ అనే వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందగా, అదే విధంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. వారి మృతదేహాలు మార్చురీలో ఉండగా అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాలేదు.
ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది ఫోన్ ద్వారా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ అధ్యక్షుడు సుబహాన్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు. ఫౌండేషన్ సభ్యుల సహకారంతో హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయాల ప్రకారం ఇద్దరి అంత్యక్రియలను గౌరవప్రదంగా నిర్వహించారు.
ఈ సేవా కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ అధ్యక్షుడు సుబహాన్, అశోక్ కుమార్, సతీష్ తదితరులు పాల్గొని అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు మాట్లాడుతూ, “సమాజంలో ఎవరికీ తోడు లేని వారికి కూడా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరగాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడమే మా లక్ష్యం” అని తెలిపారు.
మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని సభ్యులు పేర్కొన్నారు.











