హన్మకొండ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆదివారం తీవ్ర గుండెపోటు రావడంతో, హన్మకొండలోని రోహిణి ఆసుపత్రిలో డాక్టర్ మమతారెడ్డి సకాలంలో స్పందించి, తొమ్మిది సార్లు సీపీఆర్ నిర్వహించి ఆయన ప్రాణాలను కాపాడారు. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు ఆమెను ప్రశంసించారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆదివారం ఉదయం తీవ్ర గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ను హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సకాలంలో స్పందించి, ఆయన ప్రాణాలను కాపాడారు.
రోహిణి ఆసుపత్రికి చెందిన డాక్టర్ మమతారెడ్డి, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ పట్టువదలకుండా సుదర్శన్ రెడ్డికి తొమ్మిది సార్లు సీపీఆర్ (కార్డియోపల్మనరీ రిససిటేషన్) నిర్వహించారు. నిరంతరాయంగా సీపీఆర్ కొనసాగించి, గుండె మళ్లీ స్పందించేలా చేయడంలో ఆమె విజయం సాధించారు.
డాక్టర్ మమత రెడ్డి సేవలను పలువురు అభినందిస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు ఆమెను ప్రశంసించారు. బీఆర్ఎస్ శ్రేణులతో పాటు వైద్య సిబ్బంది కూడా ఆమె సేవలను కొనియాడుతున్నారు.
ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని సమాచారం.












