నిర్మల్, జూలై 24
నిర్మల్ ఆర్టీసీ డిపో డ్రైవర్లు జి. రమేష్, పెంబి జమీల్ తమ నిజాయితీతో ఒక ప్రయాణికుడి 10 గ్రాముల బంగారు గొలుసును తిరిగి అప్పగించి, మానవత్వ విలువలను చాటుకున్నారు. నిర్మల్ నుండి ఒంగోలు వెళ్తున్న బస్సులో ఈ సంఘటన చోటుచేసుకుంది.
నిర్మల్ ఆర్టీసీ డిపో డ్రైవర్ జి. రమేష్, పెంబి జమీల్ తమ నిజాయితీని చాటుకున్నారు. నిర్మల్ నుండి ఒంగోలు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు దూలం గంగాధర్ (జగిత్యాల జిల్లా, కలికోట గ్రామం) తన 10 గ్రాముల బంగారు గొలుసును నిద్రలో జారవిడుచుకున్నారు. జగిత్యాల బస్టాండ్‌లో బస్సు ఎక్కిన ఆయన, విజయవాడలో దిగిపోయారు.
బస్సు ఒంగోలు చేరుకున్న తర్వాత, డ్రైవర్లు బస్సును తనిఖీ చేయగా, ప్రయాణికుడు కూర్చున్న బెర్త్ సీటులో బంగారు గొలుసు కనిపించింది. రిజర్వేషన్ ఫోన్ నంబర్ ఆధారంగా, తిరుగు ప్రయాణంలో విజయవాడ బస్టాండ్‌కు ప్రయాణికుడిని పిలిపించారు. విజయవాడ స్టేషన్ మేనేజర్ సమక్షంలో ఆ బంగారు గొలుసును దూలం గంగాధర్‌కు అప్పగించారు.
నిజాయితీగా బంగారు గొలుసును అప్పగించిన డ్రైవర్లు జి. రమేష్, పెంబి జమీల్‌లను డిపో మేనేజర్ కే. పండరి అభినందించారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమే కాకుండా, సుఖప్రదమైనదని, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని విజయవాడ బస్టాండ్‌లో ప్రయాణికులు ప్రశంసించారు.












