మిర్యాలగూడ నియోజకవర్గంలో "ప్రగతి సింగిడి – జనంతో మాట.. పల్లె బాట" కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) మాడ్గులపల్లి మండలంలోని సీత్యా తండా గ్రామంలో పర్యటించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఆయన గ్రామంలో "పల్లె నిద్ర" చేశారు.
ఎమ్మెల్యే బిఎల్ఆర్ చేపట్టిన "ప్రగతి సింగిడి" కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు సీత్యా తండాను సందర్శించారు. శనివారం రాత్రి గ్రామస్థులతో సమావేశమై వారి అవసరాలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. అనంతరం గ్రామంలోనే బస చేసి ప్రజలతో మమేకమయ్యారు.
ఆదివారం ఉదయం సంబంధిత శాఖల అధికారులతో కలిసి గ్రామంలోని వీధుల్లో పర్యటించి, ప్రజలను కలుసుకుని వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకున్నారు.
గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామస్థులు సమర్పించిన పలు సమస్యలు, అభ్యర్థనలను స్వీకరించి, వాటిని అత్యవసరంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల వద్దకే పాలన, గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.












