మిర్యాలగూడ, జులై 29
మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్ పేటలో ఉన్న శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో బుధవారం గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ వేడుకలకు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, భక్తులకు ఆశీర్వచనం అందించారు.
మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్ పేటలో కొలువై ఉన్న శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో బుధవారం గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. గురుపౌర్ణమి శుభసందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణమంతా సాయినామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
తెల్లారుజాము నుంచి బాబావారికి కాకడ హారతితో ప్రారంభించి, మూల విగ్రహానికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, సహస్రనామార్చన, మహామంగళహారతి తదితర ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు గోవింద్ పాండే, శైలేందర్ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయాన్ని రంగురంజిత పూలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.
దర్శనానికి విచ్చేసిన భక్తులందరికీ తీర్థప్రసాదాల వితరణతో పాటు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిపాటి నవీన్ ముఖ్య అతిథులుగా పాల్గొని బాబావారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ కమిటీ సభ్యులు వారికి శాలువాలతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సమాజంలో గురువు స్థానం అత్యున్నతమైనదని, షిరిడీ సాయిబాబా బోధించిన 'శ్రద్ధ - సబురి' (నమ్మకం - ఓర్పు), 'మానవసేవే మాధవసేవ' అనే మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు.
నియోజకవర్గ ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని సాయిబాబాను ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు మంచుకొండ వెంకటేశ్వర్లు, నాగరత్నం, అధ్యక్ష కార్యదర్శులు గౌరు దయాకర్, నీలా పాపారావు, గౌరు సతీష్, కాతోజు బాల బ్రహ్మచారి, గంధం సైదులు, సాంబశివరావు, శ్రీనివాస్ - పద్మ, కౌన్సిలర్ కోటేశ్వరరావు, పెండ్యాల పద్మ, కటకం నాగరాజు, కీర్తి అశోక్, చంద్రారెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.












