వర్షపు నీటిని ఒడిసిపడదాం *మునిసిపల్ సిబ్బంది జల ప్రతిజ్ఞ
మిర్యాలగూడ జూలై 10 (మనోరంజని తెలుగు టైమ్స్)
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన (క్యాచ్ ది రైన్) ఉద్యమంలో భాగంగా మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది శుక్రవారం మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజారెడ్డి ఆధ్వర్యంలో పర్యావరణ ఇంజనీర్ శ్వేత జల ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలకు ఆదర్శంగా నిలిచేందుకు మున్సిపల్ కార్యాలయప్రాంగణంలోనే వర్షపు నీటి నిల్వ (ఆర్డబ్ల్యూహెచ్) గుంతలనునిర్మించనున్నట్లు కమిషనర్ ప్రకటించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, సిమెంట్ రోడ్ల కారణంగా వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా వృధాగా పోతోందన్నారు. భవిష్యత్తులో రాబోయే నీటి ఎద్దడిని అరికట్టడానికి ప్రతి ఇంట్లోనూ వర్షపు నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ విషయమై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మున్సిపాలిటీ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను (ఐఇసి)నిర్వహిస్తోందన్నారు.నీటి సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, మన అందరి కర్తవ్యమన్నారు. మిర్యాలగూడను జల సమృద్ధి గల పట్టణంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, మీడియా, పౌరులు భాగస్వాములు కావాలన్నారు. ఎక్కడ వర్షం కురిస్తే అక్కడ ఎప్పుడు కురిస్తే అప్పుడు ఆ నీటిని భూమిలోకి ఇంకేలా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని కోరారు.












