న్యూఢిల్లీ, 2026-08-26
ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై చేసిన ప్రసంగంలో మేడిన్ ఇండియా వస్తువులను ప్రపంచవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. అయితే, 2014లో ప్రారంభమైన ఈ నినాదం ఏడేళ్లుగా ఆచరణలో పెద్దగా ముందుకు సాగలేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. దేశ పోటీతత్వ సూచికల్లో భారత్ వెనుకబడటం, వాణిజ్య లోటు పెరగడం ఆందోళన కలిగిస్తున్నాయి.
ఎర్రకోటపై జాతీయ జండాను ఎగరవేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఉపన్యాసంలో మేడిన్ ఇండియా (భారత తయారీ) వస్తువులు ప్రపంచంలో ప్రతి మూలకూ చేర్చటం లక్ష్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. పాడిందే పాడరా అన్నట్లుగా ఇలాంటి మాటలు ఎన్నిసార్లు చెబుతారు, దేశాన్ని ఎటువైపు తీసుకుపోతున్నారన్నదే అసలైన సమస్య. ప్రధానిగా తొలి ఆగస్టు పదిహేను అంటే 2014 ప్రసంగంలో మేకిన్ ఇండియా (భారత్లో తయారీ) పిలుపునిచ్చారు. రండి, భారత్లో తయారు చేయండి, ప్రపంచంలో వాటిని ఏ దేశంలోనైనా విక్రయించండి, కానీ వాటిని భారత్లోనే ఉత్పత్తి చేయాలి అని విదేశీ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. అదే ఏడాది సెప్టెంబరు 25న న్యూ ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఏడాదీ ఏదో ఒక సందర్భంగా ఇలాంటి పిలుపులు ఇస్తూనే ఉన్నారు తప్ప అడుగు ముందుకు పడటం లేదు. డ్రోన్ వ్యవస్థలను మనం అభివృద్ధి చేయాలని, హైపర్ సోనిక్ రక్షణ సాంకేతిక రంగంలో ప్రపంచ నాయకత్వాన్ని చేపట్టాలని కూడా చెప్పారు. పన్నెండు సంవత్సరాలుగా ఎవరు వద్దన్నారు ఇప్పటికే మనకంటే ఎంతో ముందున్న దేశాలు ఈ రంగాల్లో ఇంకా ముందుకు పోతాయి. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు దేశాన్ని తయారు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
పోటీతత్వం లేకపోతే నిలబడలేం
పోటీతత్వం లేకపోతే వర్తమానంలో ఏ దేశమూ పరుగులో నిలవలేదు. అందుకు అవసరమైనట్లుగా పని చేశామా లేదా అన్నదే ముఖ్యం. స్విడ్జర్లాండ్ లోని లాసానే నగరంలో 1990లో ఐఎండి బిజినెస్ స్కూలు ఉంది. దాన్నొక ప్రతిష్టాత్మక సంస్థగా పరిగణిస్తున్నారు. ప్రతి ఏటా దేశాలను ఎంచుకొని పోటీతత్వ సూచికలను ప్రకటిస్తుంటుంది. తాజా 2026 నివేదిక ప్రకారం మన దేశం 44వ ర్యాంకులో ఉంటే చైనా పన్నెండవదిగా ఉంది. ప్రధాని చెబుతున్నట్లుగా 2047 నాటికి లేదా అంతకు ముందే మన దేశం చైనాను వెనక్కు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా మారుతుందా మోడీ చెప్పినట్లు మన వస్తువులన్నీ ప్రపంచంలో అన్ని మూలలకు ఎగుమతి అవుతాయా మాటలు కోటలు దాటటం తప్ప చేతలు గడప దాటటం లేదనే లోకోక్తి తెలిసిందే. ఇతర దేశాలతో పోటీ పడకపోవటానికి కాంగ్రెస్, నెహ్రూ, గాంధీ కారణమని కాషాయ దళాలు చెబుతుంటాయి. 2014 నుంచి అధికారంలో ఉన్న మోడీ ఏం చేశారన్నదే ప్రశ్న. తొలిసారిగా ఎర్రకోటపై మోడీ జాతీయ జెండా ఎగురవేసినపుడు ఐఎండి నివేదిక ప్రకారం భారత్ 2013లో నలభయ్యవదిగా, చైనా 21వ స్థానంలో ఉంది. తాజా సూచికల ప్రకారం 44-12 స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచమంతటా తిరిగి యుపిఏ హయాంలో కోల్పోయిన దేశ ప్రతిష్టను తిరిగి తీసుకువచ్చానని చెప్పిన తరువాత పరిస్థితి ఇది. చైనా ఎలా పెంచుకుందో, మనం ఎలా దిగజారామో దానికి కారకులు ఎవరో ఎవరిని అడిగినా చెబుతారు.
వాణిజ్య లోటు ఆందోళనకరం
మోడీ అధికారానికి వచ్చినపుడు చైనా నుంచి మనం 6,040 కోట్ల డాలర్ల మేర వస్తువులను దిగుమతి చేసుకున్నాం, 2026 మార్చి నెల నాటికి 13,160 కోట్ల డాలర్లకు పెరిగాయి, ఇదే సమయంలో చైనాతో వాణిజ్య లోటు 3,600-4,000 కోట్ల మధ్య ఉన్నది 11,200 కోట్లకు పెరిగింది. వర్తమాన సంవత్సరంలో దిగుమతులు, వాణిజ్య లోటు మరింతగా పెరగనున్నట్లు చెబుతున్నారు. బిజెపి నేతలు చైనా నుంచి మనం సెల్ఫోన్ల దిగుమతులను తగ్గించాం, చూశారా మోడీ ఘనత అంటూ అడ్డు సవాళ్లు విసురుతారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నది గనుక అనేక కంపెనీలు మన దేశంలోనే ఫోన్లు తయారు చేస్తున్నందున దిగుమతులు తగ్గినమాట నిజం, కానీ మొత్తంగా దిగుమతులు ఎందుకు పెరుగుతున్నట్లు మన వాణిజ్యలోటు పెరగటం అంటే ఏటా మనం చైనాకు అప్పనంగా అంత మొత్తాలను చెల్లిస్తున్నాం. ఎందుకీ పరిస్థితి












