ముథోల్ మండలంలోని రామ్‌టెక్ గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు సొంత ఇంటిని అందించే లక్ష్యంతో ఈ గృహప్రవేశాలు జరిగాయని ఇన్చార్జ్ ఎంపీడీవో అశోక్ తెలిపారు.
ఈ పథకం ద్వారా లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన నిర్మాణం చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు గంగాధర్, ఆత్మ స్వరూప్, ఎంపీఓ చంద్రశేఖర్, మండల సమైక్య అధ్యక్షురాలు, ఉప సర్పంచ్ జిడ్డు లక్ష్మి భూమన్నతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి, నిర్మాణ పనులు సజావుగా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.










