ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం క్షేత్రస్థాయిలో అర్హులైన పేద ప్రజలందరికీ చేరాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని "ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక" సమీక్ష ప్రత్యేక అధికారి ఇలంబర్తి అన్నారు.
బుధవారం నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో 99 రోజుల ప్రణాళిక కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా 99 రోజుల ప్రణాళికలో భాగంగా వివిధ శాఖలు చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను కలెక్టర్, అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం, శాఖల వారీగా చేపట్టిన కార్యక్రమాల వివరాలను అధికారులు చిత్ర ప్రదర్శన ద్వారా వివరించారు.
ప్రత్యేక అధికారి మాట్లాడుతూ, 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాలను అన్ని శాఖల అధికారులు సమర్థవంతంగా నిర్వహించారని అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ సంక్షేమ ఫలాలను అట్టడుగు వర్గాల ప్రజలకు చేరేలా కృషి చేయాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని స్పష్టమైన ప్రణాళికతో విజయవంతం చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. అధికారులు అందించిన నివేదికలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల వల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. అధికారులు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితో "ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక" కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, గ్రామ, వార్డు సభలు, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, రైతు, మహిళా శిశు సంక్షేమం, విద్య, ఆరోగ్యం, సాంస్కృతిక, పర్యావరణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించినట్లు తెలిపారు.
గ్రామ, వార్డు సభల ద్వారా అధికారులు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకొని పరిష్కరించారని, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అంశాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటల కొనుగోలు చేపట్టామని, భవిష్యత్తులో ధాన్యం నిల్వ కోసం అవసరమైన గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని, మహిళా సంఘాలకు పెట్రోల్ బంకుల నిర్మాణానికి ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.












