Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. డీజీపీ సి.వి. ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ సూచనలు చేశారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎస్ సంజయ్ జాజు, రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పలు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులంతా తమ కేంద్ర కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాల వారీగా వర్షపాతం, డ్యామ్‌లలో నీటి నిల్వలు, దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, చేపట్టిన సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ, ప్రజల నుంచి సమాచారం అందిన వెంటనే అధికారులు స్పందించాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో టామ్‌టామ్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని, పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగించాలని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అలాగే లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు, నదుల పరిసర ప్రాంతాలకు పశుకాపరులు, మత్స్యకారులు, ప్రజలు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజల భద్రత కోసం పోలీసు శాఖ అన్ని శాఖలతో సమన్వయంగా పనిచేస్తోందని, అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డీఆర్ఓ రాథోడ్ రమేష్, ఆర్డీఓ దేవీదాస్, సీపీవో గంగారెడ్డి, డీఎంహెచ్‌వో రాజేందర్, డీపీవో శ్రీనివాస్, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, హార్టికల్చర్ అధికారి రమణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.












