ప్రొద్దుటూరు, జూలై 29
ప్రొద్దుటూరులో మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన ఇది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో మరణించిన గుర్తు తెలియని యాచకుడికి, బంధువులు ముందుకు రాకపోవడంతో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు హిందూ సంప్రదాయం ప్రకారం గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు.
మానవత్వానికి నిదర్శనంగా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు గుర్తు తెలియని ఓ యాచకుడికి హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో మరణించిన గుర్తు తెలియని యాచకుడి మృతదేహాన్ని స్వీకరించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో పోలీసులు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ అధ్యక్షుడు సుబహాన్‌ను సంప్రదించారు.
సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన ఫౌండేషన్ సభ్యులు హిందూ శ్మశానవాటికలో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్‌రావు, టౌన్ అధ్యక్షుడు సుబహాన్, అశోక్ కుమార్, సతీష్, రసూల్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ మోరే లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ, సమాజంలో అనాథలుగా మిగిలిపోయిన వారికి కూడా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరగాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అవసరంలో ఉన్న వారికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ నిరంతరం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
అలాగే, శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు 82972 53484, 91822 44150 నంబర్లను సంప్రదించాలని ఫౌండేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు.












