Vijayawada, 2026-07-30
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆగస్టు 1న భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో, భూములు, ఇళ్లు, ఊళ్లు కోల్పోయిన వందలాది కుటుంబాలు తమకు పరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నిర్వాసిత గ్రామాల్లో ప్రజాశక్తి పర్యటించి, వారి సమస్యలను తెలుసుకుంది.
భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూములు, ఇళ్లు, ఊళ్లు కోల్పోయిన వందలాది కుటుంబాలు తమకు పరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆగస్టు ఒకటవ తేదీన ఈ ఎయిర్పోర్టును ప్రారంభించనున్న నేపథ్యంలో నిర్వాసిత గ్రామాల్లో ప్రజాశక్తి పర్యటించి, స్థానికులతో మాట్లాడింది.
బైరెడ్డిపాలెం గ్రామానికి చెందిన నిర్వాసితుడు బైరెడ్డి అప్పలనర్సయ్య తన 2.10 ఎకరాల భూమిని ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండా లాగేసుకున్నారని, నిద్రలో ఉన్నప్పడు లేపి మరీ గుడిసె కూల్చేశారని, రేపే పరిహారం ఇస్తామన్నారని కానీ, ఈ రోజు వరకూ చిల్లిగవ్వ కూడా చేతికి రాలేదని, ఎంత ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? అనేది చెప్పే నాథుడే లేడని, పరిహారం ఇవ్వకుండా ప్రారంభోత్సవం ఎలా చేస్తారని ప్రశ్నించారు.
రెడ్డిక కంచేరుకు చెందిన శీరాపు వంశీ మాట్లాడుతూ, తమ గ్రామంలో సుమారు 250 ఎకరాల భూమి తీసుకున్నారని, అందులోనే రెండు స్మశానాలు కూడా ఉన్నాయని, వాటికి ప్రత్యామ్నాయంగా స్థలం ఇస్తామని 2015లో ఇచ్చిన నోటిఫికేషన్ సమయంలో చెప్పారని, ఇప్పటి వరకు ఆ ఊసే లేదని, జీవనోపాధి పోయిందని, చివరకు చనిపోయాక పూడ్చుకునే చోటు కూడా లేకుండా చేశారని, విమానంలో ఎక్కిస్తే తమ జీవితాలు మారిపోతాయా? అని ప్రశ్నించారు. విమానాశ్రయంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం మొత్తం 2,830.08 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఇందులో ప్రధాన విమానాశ్రయానికి 2,750.15 ఎకరాలు, ట్రంపెట్ కనెక్టివిటీకి 60.08 ఎకరాలు, అప్రోచ్ రోడ్డుకు 19.85 ఎకరాలు స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ భూములతో పాటు జిరాయితీ, డి-పట్టా, అసైన్మెంట్ భూములు కూడా ఇందులో ఉన్నాయి. మొదట దాదాపు పది వేల ఎకరాలు సేకరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం సిపిఎం ఆధ్వర్యాన నిర్వాసితులు చేసిన పోరాటంతో తొలుత 5,311.88 ఎకరాలకు, చివరకు 2,750.15 ఎకరాలకు తగ్గించింది. అయినా, నాలుగు గ్రామాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. సవిరివిల్లి, ఎ.రావివలస, గూడెపువలస, కంచేరు, కవులవాడ, రావాడ, ముంజేరు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున భూములు కోల్పోగా, బొల్లెంకులపాలెం, ముడసర్లపేట, మరడపాలెం, రెల్లిపేట గ్రామాలు చరిత్రలో కలిసిపోయాయి.
2015లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రారంభ దశలో జిరాయితీ భూములకు ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.34 లక్షలు, అసైన్మెంట్ భూములకు రూ.12.50 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్వాసితుల పోరాటం, న్యాయస్థానాల జోక్యంతో అసైన్మెంట్ భూములకు కూడా జిరాయితీతో సమాన పరిహారం ఇవ్వాల్సి వచ్చింది. అయితే, ఇప్పటికీ సుమారు 400 ఎకరాలకు సంబంధించిన వంద మందికిపైగా రైతులకు పరిహారం అందలేదని నాటి నిర్వాసిత పోరాటంలో కలిసొచ్చిన స్థానిక నాయకులు చెబుతున్నారు. కొందరి పరిహారం కోర్టుల్లో జమ చేయగా, మరికొందరికి పత్రాల పరిశీలన, సాంకేతిక కారణాలు వంటి సాకులతో చెల్లింపులు నిలిపివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాష్ర్ట ఎంఎస్ఎంఇ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్... ఎయిర్ పోర్టు నిర్వాసితులకు సంబంధించి విశాఖ ట్రిబ్యునల్ కోర్టులో సుమారు 20 కేసులు, హైకోర్టులో 50 కేసులు పెండింగ్ లో ఉన్నట్టు ప్రకటించడాన్ని బట్టి సమస్య తీవ్రత అర్థమవుతోంది.












