నిజామాబాద్, జూలై 6
గల్ఫ్ నుంచి స్వగ్రామానికి వచ్చిన దాయిని ప్రశాంత్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు భార్య అక్రమ సంబంధమే కారణమని తేల్చారు. ఈ కేసులో భార్య సంధ్యతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు దక్షిణ గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్సై సుస్మిత జాడ్జె వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లాలోని న్యాల్కల్ గ్రామానికి చెందిన దాయిని ప్రశాంత్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. భార్య అక్రమ సంబంధమే హత్యకు కారణమని దర్యాప్తులో తేలడంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు దక్షిణ గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్సై సుస్మిత జాడ్జె తెలిపారు.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. గల్ఫ్ దేశంలో ఉద్యోగం చేస్తున్న దాయిని ప్రశాంత్ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. అనంతరం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో అతని తల్లి దాయిని శ్యామల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో మృతుడి భార్య సంధ్యకు నిజామాబాద్‌కు చెందిన అనిల్‌తో అక్రమ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. భర్త తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన సంధ్య, అనిల్ కలిసి అతడిని హత్య చేయాలని కుట్ర పన్ని, గ్రామానికి చెందిన వెంకటసాయి అలియాస్ బంటిని తమకు సహకరించేలా ఒప్పించారు.
పథకం ప్రకారం ప్రశాంత్‌కు అధికంగా మద్యం తాగించి ఇంటి డాబాపైకి తీసుకెళ్లి కిందకు తోసివేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని అనుమానం రాకుండా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించిన అనంతరం ఇంటికి తీసుకొచ్చి, ముందుగానే సిద్ధం చేసుకున్న మత్తు మందులు, మత్తు మాత్రలతో తయారు చేసిన ద్రావకాన్ని చేతికి అమర్చిన సూది ద్వారా శరీరంలోకి ఎక్కించారు. అనంతరం మరుగుదొడ్డి శుభ్రపరిచే ద్రావకాన్ని కూడా శరీరంలోకి పంపించి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్సై సుస్మిత జాడ్జె తెలిపారు.
విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారిని చట్టపరమైన విధానాల ప్రకారం అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సుస్మిత జాడ్జె వెల్లడించారు.












