పెద్దపల్లి, ఆగస్టు 01
ఎన్నికల హామీలను నెరవేర్చాలని, ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని విస్మరించవద్దని ఆటో జేఏసీ నాయకులు మంద రవికుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. గోదావరిఖని బస్టాండ్ అడ్డాలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లను మభ్య పెట్టడం మానుకొని, 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలని ఆటో జేఏసీ నాయకులు మంద రవికుమార్ అన్నారు. ఆగస్టు 1వ తేదీన ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా గోదావరిఖని బస్టాండ్ అడ్డాలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అర్హు లైన ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12వేలు ఇవ్వాలని, ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎందరో ముఖ్యమంత్రులను చూసాం కానీ, కార్మికుల పొట్టలు కొట్టే ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదని అన్నారు.
ఇచ్చిన హామీలను మరిచి, మళ్లీ కొత్తగా ఆటో డ్రైవర్లను మోసం చేయడానికి 'ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైలు వరకు ఆర్టీసీ ఆటోలు' అనే కార్యక్రమాన్ని తీసుకురావడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఆటో డ్రైవర్లను మోసం చేసే ఇలాంటి పథకాలను మేము సహించబోమని మంద రవికుమార్ హెచ్చరించారు.
రామగుండం కార్పొరేషన్ ఆటో జేఏసీ అధ్యక్షులు ఎండి బురహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కో కన్వీనర్ ఎస్ కే జబ్బర్, జిల్లా నాయకులు కాజీపేట రాజయ్య, పల్లెబాపు, రాజేశం, మడిపెద్ది రమేష్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












