** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 15
ముధోల్ నియోజకవర్గంలో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కలకలం సృష్టించింది. రెండు రోజుల క్రితం దొంగిలించబడిన ట్రాన్స్ఫార్మర్ను అధికారులు ఇంకా ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో విద్యుత్ సరఫరా లేకపోతే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు రోజుల క్రితం తన పంట చేనులోని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను దొంగలు అపహరించారు. దీనికి సంబంధించిన విషయాన్ని రైతు సునిల్ ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులకు, పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు అందించారు. ట్రాన్స్ ఫార్మర్ దొంగతనంపై ఫిర్యాదు అందగానే స్థానిక ఎస్సై బిట్ల పెర్సిస్, విద్యుత్ శాఖ సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లి సంఘటనను పరిశీలించారు.
అయితే, ఇప్పటి వరకు కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు లేకపోవడంతో పంటలకు నీరందించే అవకాశం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగునీటి కోసం విద్యుత్ సరఫరా అత్యవసరమైన ఈ సమయంలో ట్రాన్స్ఫార్మర్ను వెంటనే ఏర్పాటు చేయకపోవడం వల్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే కొత్త వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని బాధిత రైతులు విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.












