హైదరాబాదులోని మలక్ పేట యశోద హాస్పిటల్ లో క్యాన్సర్ వ్యాధికి అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉందని, కల్తీ ఆహారం, ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్ కు ప్రధాన కారణాలని ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ నివాళిక రాజ మోని తెలిపారు. మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ వివరాలు వెల్లడించారు.
గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ నివాళిక రాజ మోని మాట్లాడుతూ, క్యాన్సర్ పెరగడానికి ప్రధాన కారణం కల్తీ కలిసిన ఆహారం, ఆహారం తయారీకి ఉపయోగించే రంగులు, ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వాడకం అని తెలిపారు. ప్రజలు ఈ అలవాట్ల వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆమె పేర్కొన్నారు.
క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడంలో 'పెట్ సిటీ స్కాన్' కీలక పాత్ర పోషిస్తుందని, దాని ద్వారా వ్యాధి ఏ స్టేజిలో ఉందో తెలుసుకోవచ్చని ఆమె వివరించారు. ప్రస్తుతం క్యాన్సర్ నివారణకు రేడియేషన్, కీమోథెరపీలు అందుబాటులో ఉన్నాయని, మలక్ పేట్ యశోద ఆసుపత్రిలో ఇటీవల హైపర్ సైట్ మిషన్ ద్వారా అత్యాధునిక చికిత్స విధానం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.
రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి అడ్వాన్స్ మెడిసిన్, ఇమ్యునోథెరపీ విధానాలు కూడా అందుబాటులో ఉన్నాయని, యశోద హాస్పిటల్ లో అన్ని రకాల క్యాన్సర్లకు అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉందని, రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
అదనంగా, మిర్యాలగూడ పరిసర ప్రాంతాల ప్రజల కోసం, పట్టణంలోని సూర్య డయాగ్నస్టిక్ సెంటర్ లో ప్రతినెల 4వ బుధవారం క్యాన్సర్ సంబంధిత రోగులకు వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ వాసు కిరణ్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.












