నగరంలోని మూడు ప్రధాన టవర్లలో వెల్నెస్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఉచిత మహా వైద్య శిబిరం ప్రారంభమైంది. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు ఈ శిబిరాన్ని ప్రారంభించి, ప్రజలు ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నీలకంటేశ్వర టవర్లు, పొద్దుటూరి టవర్లు, అల్లుళ్ల టవర్లలో ఏర్పాటు చేసిన ఈ శిబిరం ద్వారా నివాసితులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆసుపత్రి యాజమాన్యం చేస్తున్న కృషిని విఠల్ రావు అభినందించారు.
ఈ వైద్య శిబిరం ఏర్పాటులో నీలకంటేశ్వర టవర్ల కార్యదర్శి డాక్టర్ సాయికృష్ణ గౌడ్ సోదరుడు, ఆసుపత్రి నిర్వహణాధికారి సుమన్ గౌడ్ కీలక పాత్ర పోషించారు. మూడు అపార్టుమెంట్ల నివాసితులకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించడం అభినందనీయమని నిర్వాహకులు తెలిపారు.
శిబిరంలో భాగంగా రూ.50 వేల విలువైన కుటుంబ ఆరోగ్య కార్డులను ఉచితంగా అందజేస్తున్నారు. అంతేకాకుండా, బయటి రోగులకు ప్రత్యేక రాయితీలతో కూడిన సేవలు, పరీక్షలు, ఔషధాలు, ఎక్స్రే వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు వెల్లడించారు.








