రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్నతో పాటు సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మే 11 నుండి 17 వరకు చేపట్టనున్న వారాంత కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలల్లో ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న సివిల్ పనులకు శంకుస్థాపనలు చేయాలని సూచించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రాధాన్యతనిస్తూ, ఇంటర్మీడియట్ విద్యార్థుల రెమెడియల్ తరగతులు పూర్తి చేసి, పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక రెమెడియల్ తరగతులను ప్రారంభించాలని తెలిపారు.
ఏడు రోజుల ప్రణాళికలో భాగంగా పలు వినూత్న కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. “సెలెక్టివ్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్” కింద నియోజకవర్గ స్థాయిలో సర్పంచులకు ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహించి, పాఠశాలల అభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా “జయశంకర్ బడిబాట”, మెగా టీచర్-పేరెంట్ మీటింగ్, లైబ్రరీ డే, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
విద్యార్థుల సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు “కళావైభవం” పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, వారాంతంలో “విద్యా విజయోత్సవం” ఘనంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.












