Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, చలిగాలుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డా. రాజేందర్ సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు, వీస్తున్న చలిగాలుల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డా. రాజేందర్ సూచించారు. ముఖ్యంగా పసిపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఆరోగ్య పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వర్షాల ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు వెచ్చని దుస్తులు ధరించాలని, ఆహారాన్ని ఎప్పటికప్పుడు తాజాగా వండుకుని తీసుకోవాలని సూచించారు. తాగునీటిని తప్పనిసరిగా కాచి చల్లార్చిన తర్వాత మాత్రమే వినియోగించాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించాలని కోరారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం చేపట్టాలని సూచించారు.
జ్వరం, దగ్గు, జలుబు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని జిల్లా వైద్యాధికారి డా. రాజేందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












