ఏలూరు, జూలై 29
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతిపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, రాష్ట్ర వైద్య విద్యా శాఖ డైరెక్టర్ డా. విష్ణువర్ధన్ విచారణ చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మరణించిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఏలూరు, జూలై 29: ఈనెల 23వ తేదీన ఏలూరు సర్వజన ఆసుపత్రిలో నవజాత శిశువు మృతిపై విచారణ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. స్థానిక ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో బుధవారం ఉదయం రాష్ట్ర వైద్య విద్యా శాఖ డైరెక్టర్ డా. విష్ణువర్ధన్ తో కలిసి, ఇటీవల మృతిచెందిన నవజాత శిశువు కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ కలిసి, వివరాలను అడిగి తెలుసుకుని, వారిని ఓదార్చారు.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ శిశువు మరణించిందని బాధితులు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, రాష్ట్ర వైద్య విద్యా శాఖ డైరెక్టర్ డా. విష్ణువర్ధన్ లకు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, కేసు షీట్లు, రికార్డులు పరిశీలించి, శిశువు మరణంపై సమగ్ర విచారణ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో పేషంట్లకు అందుతున్న సేవలు, సౌకర్యాలను కలెక్టర్ వెట్రిసెల్వి, డైరెక్టర్ డా. విష్ణువర్ధన్ లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ లో సౌకర్యాలను పరిశీలించారు. అక్కడి రోగులను కలిసి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఆసుపత్రిలో సిసి కెమెరాలు పనిచేయకపోవడం, బెడ్ షీట్లు మురికిగా, చిరిగి ఉండడంతో సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపి, ఐపి కౌంటర్ల వద్ద రోగులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా త్వరితగతిన నమోదు చేసేలా చూడాలన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, వివిధ వైద్య విభాగాలకు చెందిన హెచ్ఓడి లు ఓపి సమయంలో రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ లో వైద్య చికిత్స యంత్రాలను సిఎస్ ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులు ద్వారా సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నిరుపేదలకు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలందించడం ద్వారా ప్రజల సంతృప్తి స్థాయిని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ డా. విష్ణువర్ధన్ కు కలెక్టర్ సూచించారు.
రాష్ట్ర వైద్య విద్యా శాఖ డైరెక్టర్ డా. విష్ణువర్ధన్ మాట్లాడుతూ, ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇటీవల మృతిచెందిన నవజాత శిశువు మృతిపై విచారణ చేపడుతున్నామని, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి డా. అనిల్ ను విచారణ అధికారిగా నియమించి, నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఓపి, ఐపి నమోదు రెండింతలు అయిందన్నారు. అదేవిధంగా శస్త్రచికిత్సలు కూడా మూడు నుండి నాలుగు రెట్లు పెరిగాయని, ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలపై ప్రజలకు పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. శిశువు మృతి ఒక దురదృష్ట సంఘటన అని, విచారణలో వైద్యుల నిర్లక్ష్యం అని తేలితే తక్షణం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలలో లోపాలు, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వంటి వాటిని తన ఫోన్ 9849902961 నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయవచ్చన్నారు.












