యోగ సాధనతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఆనందం, ప్రశాంతత, సమతుల్యత పెరుగుతాయని తెలంగాణ ఎకనామిక్ ఫోరం, తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం అధ్యక్షులు నేదునూరి కనకయ్య తెలిపారు. నిత్య యోగ సాధన ద్వారా నిరాశ, నిస్పృహలు తొలగి ఆందోళన, ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు.
యోగ మనిషికి నవయవ్వనాన్ని ప్రసాదించడంతో పాటు బలం, ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని నేదునూరి కనకయ్య పేర్కొన్నారు. యోగతో నైపుణ్యాభివృద్ధి పెరిగి ఉత్పాదకత, సామర్థ్యాలు మెరుగుపడతాయని, జీవన ప్రమాణాలు ఉన్నత స్థాయికి చేరుకుంటాయని వివరించారు. శ్వాసాభ్యాసం, ధ్యానం ద్వారా మనసు-ఆత్మ సమన్వయం ఏర్పడి అంతర్గత శాంతి కలుగుతుందని తెలిపారు.
రక్తపోటు, వెన్నునొప్పి, ఆర్థరైటిస్, అధిక బరువు వంటి ఆరోగ్య సమస్యలను యోగ ద్వారా నియంత్రించవచ్చని ఆయన సూచించారు. సామూహిక యోగ సాధనతో ఒంటరితనం తొలగి సమిష్టి జీవన విధానం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా యోగ ప్రాచుర్యానికి భారతదేశం కీలక పాత్ర పోషిస్తోందని, “వసుధైవ కుటుంబకం” భావనతో నిర్వహించే అంతర్జాతీయ యోగ దినోత్సవం ఆరోగ్య భారత్ సాధనకు దోహదం చేస్తుందని కనకయ్య పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగ ప్రాచుర్యానికి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. స్వామి వివేకానంద ఇచ్చిన “లేచి నిలబడి లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించకండి” అనే పిలుపును స్ఫూర్తిగా తీసుకుని యోగాన్ని విశ్వవ్యాప్తం చేయాలని కోరారు.












