నిర్మల్, 2026-07-17
కొత్తూరు మండలం సిద్ధాపూర్లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ వ్యవహారం తీవ్రతరం అవుతోంది. జహంగీర్ పీర్ దర్గా పరిరక్షణ పేరుతో మైనార్టీ వర్గాలు ఉద్యమంలోకి దిగాయి. "దర్గా బచావో – డంపింగ్ యార్డ్ హటావో" నినాదంతో పెద్ద ఎత్తున పోరాటం చేపట్టనున్నట్లు నాయకులు ప్రకటించారు. రేపు రంగారెడ్డి కలెక్టరేట్‌కు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
కొత్తూరు మండలం సిద్ధాపూర్లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ వ్యవహారం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఉద్యమంలో భాగమవుతుండగా, ఇప్పుడు జహంగీర్ పీర్ దర్గా పరిరక్షణ పేరుతో మైనార్టీ వర్గాలు కూడా ఉద్యమంలోకి దిగుతున్నాయి. "దర్గా బచావో – డంపింగ్ యార్డ్ హటావో" నినాదంతో పెద్ద ఎత్తున పోరాటాన్ని చేపట్టనున్నట్లు నాయకులు ప్రకటించారు.
సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట నాయకుడు, కొత్తూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లారం శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆగిరి రవికుమార్ గుప్తా, యువ నాయకుడు ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. డంపింగ్ యార్డ్ ప్రతిపాదనతో జహంగీర్ పీర్ దర్గా పరిసర ప్రాంతాల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నందున అన్ని వర్గాలను ఏకం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
ఈ ఉద్యమానికి కృష్ణ మహేష్ ప్రజాసేన ఆల్ ఇండియా అధ్యక్షుడు ఎండి ఖాదర్ గోరి మద్దతు ప్రకటించారు. మైనార్టీ నాయకుడిగా, ప్రజాసేన అధ్యక్షుడిగా జహంగీర్ పీర్ దర్గా పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమానికి సంపూర్ణ సంఘీభావం తెలుపుతూ తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎల్లారం శేఖర్ రెడ్డి, ఆగిరి రవికుమార్ గుప్తాలను కలిసి తన మద్దతును ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎండి ఖాదర్ గోరి మాట్లాడుతూ, దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు దర్శించుకునే హజ్రత్ జహంగీర్ పీర్ బాబా దర్గా సమీపంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాధాన్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దర్గా పరిసర ప్రాంతం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజల మనోభావాలను, ముఖ్యంగా మైనార్టీ భక్తుల భావాలను గౌరవిస్తూ డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈ అంశంపై ప్రత్యేకంగా స్పందించి, మైనార్టీల ఆందోళనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎండి ఖాదర్ గోరి విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, రేపు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎల్లారం శేఖర్ రెడ్డి ప్రకటించారు. జహంగీర్ పీర్ దర్గా నుంచి వేలాది మంది భక్తులు, దర్గా ప్రాంత ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలతో కలిసి కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇనుముల నర్వ ప్రాంతంలో ఎండి ఖాదర్ గోరి, కొత్తపేట ఉస్మాన్, అక్రమ్ తదితర నాయకులతో సమావేశమై ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. మైనార్టీ వర్గాల తరఫున సంపూర్ణ మద్దతు అందిస్తామని, దర్గా పరిరక్షణ కోసం అన్ని విధాలుగా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు.












