బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25
బోథ్ మండల కేంద్రానికి చెందిన నమలికొండ సుజయ్ కుమార్ శర్మ, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారి 'విద్యా సరస్వతి' కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతిలోని క్రేంబ్రిడ్జ్ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో సుజయ్ కుమార్ శర్మ గణపతి, సరస్వతి పూజలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమం పీఠం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధర్మం, ఉన్నత లక్ష్యాలపై అవగాహన కల్పించేందుకు నిర్వహించారు.
బోథ్ మండల కేంద్రానికి చెందిన నెమలికొండ సంతోష్ కుమార్ శర్మ, శ్రీదేవి దంపతుల కుమారుడు నమలికొండ సుజయ్ కుమార్ శర్మ, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు సంకల్పించిన 'విద్యా సరస్వతి' కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారు తిరుపతిలో ఎంపిక చేసిన వంద పాఠశాలల్లో ఈ నెల 23న గణపతి, సరస్వతి పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతిలోని క్రేంబ్రిడ్జ్ పాఠశాలలో బోథ్ కు చెందిన నమలికొండ సుజయ్ కుమార్ శర్మ పాల్గొని పూజా క్రతువును పూర్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మొత్తం వంద మంది విద్యార్థులను ఎంపిక చేసి, ఒక్కొక్కరిని ఒక్కో పాఠశాలకు పంపించారు. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే ధర్మం గురించి తెలియజేస్తూ, భగవంతుని ధ్యానంతో పాటు జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని, దానికోసం ముందుకు ఎలా సాగాలో అవగాహన కల్పించడంలో భాగంగా పీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా మొదటి విడతలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
కాగా, ఈ కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు గాను శుక్రవారం తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో సుజయ్ కుమార్ శర్మకు సన్మానంతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. సుజయ్ కుమార్ కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్న తిరుపతి వేద, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో స్మార్ట్ విద్యతో పాటు ఇంగ్లీష్ మీడియంలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు.
కంచి స్వామి ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ధర్మ పరిరక్షణ యజ్ఞంలో తమ కుమారుడు భాగస్వామి కావడం పట్ల సుజయ్ తల్లిదండ్రులు శ్రీదేవి, సంతోష్ కుమార్ శర్మలు ఆనందం వ్యక్తం చేశారు.












