ఖానాపూర్, జూలై 25
రాష్ట్రంలోని ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యారంగ సమస్యలపై ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లకు వినతిపత్రం సమర్పించారు. పెండింగ్ బకాయిలు, ఫిట్మెంట్, సీపీఎస్ రద్దు వంటి పలు అంశాలపై ఆయన గవర్నర్‌కు వివరించారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో భాగంగా, రాష్ట్రంలోని ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యారంగ సమస్యలపై గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్ల గారికి ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
పీఆర్సీ ప్రకటించి, 51% ఫిట్మెంట్ అమలు చేయాలని, ఈ-కుబేర్ ద్వారా పెండింగ్ బిల్లులు, ఆరు డీఏలు, పెన్షన్ బకాయిలు విడుదల చేయాలని ఎమ్మెల్సీ కోరారు. అలాగే, ఎస్ఎస్ఏ–కేజీబీవీ సిబ్బందికి 29 రోజుల సమ్మె వేతనాలు, మోడల్ స్కూల్ 010 సమస్య పరిష్కారం, విద్యాశాఖలో జీవో-190 అమలు, సీపీఎస్ రద్దు చేసి 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.
గురుకుల, ఆశ్రమ, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, హెల్త్ ట్రస్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేసి, హెల్త్ కార్డులను అన్ని గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో వర్తింపజేయడం, ప్రభుత్వ పాఠశాలలకు జూలైలోపే గ్రాంట్లు విడుదల చేయాలని సూచించారు. వార్షిక పదోన్నతులు–బదిలీల క్యాలెండర్ ప్రకటించడం, ప్రత్యేక టెట్‌లో 40% అర్హతతో ఎయిడెడ్ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించడం, అన్ని గురుకులాల్లో ఏకరీతి పని వేళలు అమలు చేయాలని కూడా గవర్నర్‌ను కోరారు.
రాష్ట్రంలోని ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యారంగ పరిస్థితులను వివరించి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయాలని ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య గవర్నర్‌ను విజ్ఞప్తి చేశారు.











