** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 14
దేశంలో పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో అవినీతి, విద్యార్థుల ఆత్మహత్యలపై సీపీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ నెల 20న జరగనున్న చలో పార్లమెంట్ కార్యక్రమానికి మద్దతు ప్రకటించింది.
విద్యను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ, పరీక్షల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న మోడీ ప్రభుత్వ విధానాల వల్ల దేశ యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని సీపీఎం నేతలు అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20న నిర్వహించనున్న చలో పార్లమెంట్ కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు.
దేశంలో వరుసగా జరుగుతున్న పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో పెరుగుతున్న అవినీతి, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఆందోళన, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షా శిబిరాన్ని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీ అమ్రారామ్, సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య, లోకనాథం, డి. రమాదేవి, టి. జ్యోతి, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం. సాయిబాబు సోమవారం సందర్శించారు. సోనమ్ వాంగ్చుక్ను పరామర్శించి, సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. అనంతరం సిజెపి వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేతో సమావేశమై ఉద్యమ పరిస్థితులను, భవిష్యత్ కార్యాచరణను చర్చించారు. దీక్షా శిబిరంలో ఉన్న విద్యార్థులు, యువత, ప్రజలకు నాయకులు అభివాదం చేశారు. ఎస్ఎఫ్ఐ ఏర్పాటు చేసిన ‘క్రాంతి వేదిక’ను సందర్శించారు.
ఈ సందర్భంగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీ అమ్రారామ్ మాట్లాడుతూ ఈ సమస్యను పార్లమెంట్లో బలంగా లేవనెత్తి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఉద్యమం దేశ యువత భవిష్యత్తును కాపాడే పోరాటమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, సీపీఎం తరపున పూర్తి సంఘీభావం ప్రకటించారు.
“నీట్ పరీక్షా విధానం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వారి భవిష్యత్తు అంధకారంలో పడింది. ఈ పరీక్షా పత్రాల లీకేజీల వల్ల విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఈ బాధలు భరించలేక ఇప్పటికే 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు” అని చెప్పారు. “ఈ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని యావత్ దేశం డిమాండ్ చేస్తోంది. కానీ ప్రధాని మోడీ మొండికెత్తి, మంత్రిని సంకలో బిడ్డలాగా పోషిస్తూ రక్షిస్తున్నారు. వరుస పేపర్ లీకేజీలకు, విద్యా వ్యవస్థలో నెలకొన్న అరాచకానికి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. లేకపోతే రాష్ట్రపతి జోక్యం చేసుకుని ఆయనను పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయకపోతే యువతరం ఆగ్రహంతో పోరాటానికి సిద్ధంగా ఉంది” అని హెచ్చరించారు. మోడీ ప్రభుత్వ విద్యా విధానాలు దేశ యువత ఆశయాలను దెబ్బతీస్తున్నాయని ఆయన విమర్శించారు.












