నిర్మల్, జూన్ 29
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి నిర్మల్ గ్రామీణ మండలం అనంతపేట గ్రామంలోని కేజీబీవీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
సోమవారం రాత్రి నిర్మల్ గ్రామీణ మండలం అనంతపేట గ్రామంలోని కేజీబీవీని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించి, ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. ఇప్పటివరకు చెప్పిన పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులతో లెక్కలు చేయించి, సరిగ్గా సమాధానాలు చెప్పిన వారిని అభినందించారు. విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు నాలుగు బృందాలుగా విభజించి పదాల కూర్పు ఆట నిర్వహించారు. కొత్త విషయాలు నేర్చుకునేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపాలని సూచించారు.
వసతి గృహంలో ఎదురవుతున్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య ఉందని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన కలెక్టర్ శుద్ధి చేసిన నీటి సదుపాయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసీల్దార్ ప్రభాకర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










