జైనూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల హామీ మేరకు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, కళాశాలలో మరుగుదొడ్ల సౌకర్యం మెరుగుపరచాలని కోరుతున్నారు.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిరోజూ దూర ప్రాంత గ్రామాల నుంచి ఉదయాన్నే కళాశాలకు వస్తున్నామని, చాలామంది సరైన ఆహారం తీసుకోకుండానే తరగతులకు హాజరవుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. దీంతో మధ్యాహ్నానికి ఆకలితో చదువుపై ఏకాగ్రత కోల్పోతున్నామని పేర్కొన్నారు. వెంటనే జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసి విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అదేవిధంగా కళాశాలలో తగినన్ని మరుగుదొడ్ల సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థినులు ఎక్కువ అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. కళాశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని తక్షణమే ప్రారంభించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.












