ఉద్యోగ విధులు నిర్వహిస్తూ.. డాక్టరేట్ సాధించిన గ్రామ కార్యదర్శి పూసపాటి నరేష్
👉 ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీ.హెచ్.డి. పట్టా పొందిన ఆలగడప వాసి
మిర్యాలగూడ ఆగస్టు 4 (మనోరంజని తెలుగు టైమ్స్)
పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాన్ని సాధించడం సులభమే అని మరోసారి రుజువు అయింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామానికి చెందిన డాక్టర్ పూసపాటి నరేష్. గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఒకవైపు వృత్తి రీత్యా పకడ్బందీగా బాధ్యతలు నిర్వహిస్తూ మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ (పీహెచ్డీ) పట్టా అందుకుని గ్రామానికి, కుటుంబానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ మాట్లాడుతూ, 2009 తెలంగాణ ఉద్యమంలోచురుకుగా పాల్గొంటూ అనేక కష్టాలనుఎదుర్కొన్నానని తెలిపారు.అనంతరం 2018లో రాజనీతి శాస్త్రంలో పీహెచ్డీ ప్రవేశం పొంది, 2019లో గ్రామపంచాయతీ కార్యదర్శిగా ప్రభుత్వ ఉద్యోగం సాధించానని తెలిపారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే, తన పరిశోధన పర్యవేక్షకులు చంద్రుమార్గదర్శకత్వంలో "దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీల ప్రభావం – తెలంగాణలో టీఆర్ఎస్ పాత్ర" అనే అంశంపై పరిశోధన పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ పరిశోధనకు గుర్తింపుగా ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ పట్టా ప్రదానం చేయడం తనకు ఎంతో ఆనందంగాఉందన్నారు. తన తల్లిదండ్రుల కలను నెరవేర్చాలనే సంకల్పంతోనే ఈ పీహెచ్డీ పూర్తి చేశానని డాక్టర్ నరేష్ తెలిపారు. ఈ విజయాన్ని తన తల్లిదండ్రులు పూసపాటి నాగయ్య, నాగమణి, సతీమణి సాయి శిరీష, తనను ప్రోత్సహించిన కుటుంబ సభ్యులు, తన అన్న దివంగత పూసపాటి రవీందర్ స్మృతికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ పూసపాటి నరేష్ సాధించిన ఈ ఘనత పట్ల గ్రామస్తులు, మిత్రులు,ప్రజాప్రతినిధులు, సహోద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకుఅభినందనలు తెలియజేశారు.












