2014 నుంచి బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని, విద్యార్థిని తేజస్విని మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అసెంబ్లీలో డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే పటేల్ ట్రిపుల్ ఐటీ సమస్యలను ప్రస్తావించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని తేజస్విని మృతి చెందిందని, సరైన వైద్యం అందకపోవడమే దీనికి కారణమని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలపై దృష్టి సారించడం లేదని విమర్శించారు.
విద్యార్థులకు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు లేకపోవడం వల్ల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారని, మెస్ కాంట్రాక్టర్లు పేర్లు మార్చుకుని కొనసాగుతున్నారని, టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను నియమించాలని సూచించారు. ట్రిపుల్ ఐటీ పర్యవేక్షణకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.
మౌలిక సదుపాయాల కొరత, నియామకాల్లో పారదర్శకత లోపించడం, విద్యార్థులను బెదిరించడం వంటి ఆరోపణలు చేశారు. బేకరీ యజమాని అధిక ధరలకు వస్తువులు అమ్ముతూ విద్యార్థులను దోచుకుంటున్నారని విమర్శించారు.
అంతేకాకుండా, ప్రాణహిత చేవెళ్ల 28 ప్యాకేజీ పనులకు నిధులు మంజూరు చేయాలని, ఇది పూర్తయితే ముధోల్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించాలని, మరో 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు చేయాలని కోరారు.









