బాసర ట్రిపుల్ ఐటీలో 2014 నుండి జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సమగ్ర విజిలెన్స్ విచారణ జరపాలని, విద్యార్థి మృతికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అసెంబ్లీలో డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ట్రిపుల్ ఐటీ సమస్యలను ప్రస్తావిస్తూ, అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థి తేజస్విని మృతి చెందిందని, సరైన వైద్యం అందక ప్రాణం కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలపై దృష్టి సారించడం లేదని విమర్శించారు.
విద్యార్థులకు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు అందుబాటులో లేకపోవడం వల్ల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారని, మెస్ కాంట్రాక్టర్లు పేర్లు మార్చుకుంటూ ఏళ్ల తరబడి కొనసాగుతున్నారని, నామినేషన్ పద్ధతిని రద్దు చేసి టెండర్లు పిలవాలని సూచించారు.
ట్రిపుల్ ఐటీ పర్యవేక్షణకు ప్రజాప్రతినిధులు, విద్యావంతులతో కమిటీ వేయాలని, మౌలిక సదుపాయాల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నియామకాల్లో పారదర్శకత లేదని, సమస్యలు అడిగితే ఫెయిల్ చేస్తామని అధికారుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని, బేకరీలో అధిక ధరలకు వస్తువులు అమ్ముతూ విద్యార్థులను దోచుకుంటున్నారని ఆరోపించారు.
ఈ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోరారు.











