నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. వివిధ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఉదయం నుండే భక్తులు కోనేటి నీటితో స్నానాలు ఆచరించి, అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ తో పాటు మహారాష్ట్రలోని నాందేడ్, నాక్ పూర్, పర్బాని జిల్లాల నుండి భక్తులు ప్రత్యేక వాహనాల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులను తీర్చుకున్నారు.
పుట్టెంటులు, ఉదిబియ్యం సమర్పించి, ఖుషీ పండుగలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఆలయ పరిసరాల్లో వంటా వార్పు చేసుకుని భోజనాలు చేశారు.
ఆలయ చైర్మన్ సింగం భోజగౌడ, ఈఓ భూమయ్యలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించి, ఆలయ పరిసరాల్లో శాంతిభద్రతలను పర్యవేక్షించారు.












