శ్రీశైలం, 2026-06-05
శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
శ్రీశైలంలోని వడ్డెర సత్రం రూమ్ నెం.11లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటుచేసుకుంది. మృతులను శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన పల్లపు సుధాకర్ (50), గోగుల ఆదిలక్ష్మి (36), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), మణికంఠ (15)గా పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరు పురుషులు ఫ్యాన్‌కు, ముగ్గురు మహిళలు కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకుని మృతి చెందారు. ఈ ఘటన మూడు రోజుల కిందట జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులే కారణం
మృతులు గత నెల 28న ఆటోలో శ్రీశైలానికి వచ్చి, రోజుకు రూ.800 అద్దెతో వడ్డెర సత్రంలో ఉంటున్నారని డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. సుధాకర్‌కు పెళ్లి కాలేదని, ఇద్దరు చెల్లెళ్లు భర్తలను వదిలి ఇంట్లోనే ఉంటున్నారని ఆయన వివరించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ పేర్కొన్నారు.












