నంద్యాల, 2026-08-25
శ్రీశైలం వడ్డెర అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందులే ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
శ్రీశైలం వడ్డెర అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. గత మూడు రోజులుగా గది నుంచి బయటకు రాకపోవడంతో పాటు దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన సత్రం నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా, బాత్రూమ్లో ముగ్గురు మహిళలు, ఫ్యాన్‌కు వేలాడుతూ ఇద్దరు పురుషులు కనిపించారు. మృతులను సుధాకర్ (36), గోగుల ఆదిలక్ష్మి (50), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), మణికంఠ (15)గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులే ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
అధికారుల పరిశీలన
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని ఆలయ ఈవో శ్రీనివాసరావు, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ పరిశీలించారు. మృతులు సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు.
గది అద్దె వివరాలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సుధాకర్ కుటుంబ సభ్యులు గత నెల 28వ తేదీన శ్రీశైలం వడ్డెర సత్రంలోని రూమ్ నెంబర్ 11ను రోజుకు రూ. 800 చొప్పున అద్దెకు తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత గది ఖాళీ చేయాలని నిర్వాహకులు సూచించినప్పటికీ, అనారోగ్యంతో వచ్చామని, మరికొన్ని రోజులు పూజలు చేసుకుని వెళ్తామని సుధాకర్ చెప్పినట్లు సమాచారం. అప్పటి నుంచి రోజుకు రూ. 800 చెల్లిస్తూ అక్కడే ఉంటున్నారు.
పోలీసుల దర్యాప్తు
ఐదుగురి మృతదేహాలను శ్రీశైలం పోలీసులు స్వాధీనం చేసుకుని, శవ పరీక్షల కోసం సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా వడ్డెర సత్రం యాజమాన్యం యాత్రికులకు నెల రోజులపాటు గదిని అద్దెకు ఎలా ఇచ్చారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతిచెందిన వ్యక్తులు శ్రీశైలంలో నెల రోజులపాటు ఎందుకు ఉన్నారనే కోణంలోనూ విచారణ ముమ్మరం చేశారు.











