నిర్మల్, జులై 8
కుబీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో జరిగిన పోక్సో కేసులో నిందితుడు బనెల్లి విఠల్‌కు నిర్మల్ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10,000 జరిమానా విధించింది. ఈ కేసులో పోలీసులు, ప్రాసిక్యూషన్ కీలక ఆధారాలను సమర్పించి నిందితుడికి శిక్ష పడేలా చేశారని ఎస్పీ డా. జి. జానకి షర్మిల తెలిపారు.
2022 సంవత్సరంలో కుబీర్ మండలం నిగ్వ గ్రామానికి చెందిన బనెల్లి విఠల్ అనే వ్యక్తి, అదే గ్రామానికి చెందిన 09 ఏళ్ల బాలికకి చాక్లెట్ల ఆశ చూపి, ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోర ఘటనపై కుబీర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కేసు విచారణ సందర్భంగా సంబంధిత సాక్ష్యాలు, ఆధారాలను పరిశీలించిన తరువాత, ఈరోజు నిర్మల్ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ఫోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి శ్రీవాణి నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 10,000 జరిమానా విధించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ మాట్లాడుతూ, సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ కూడా శిక్ష నుండి తప్పించుకోలేరని తెలిపారు. బాలికలపై లైంగిక నేరాలకు కఠిన శిక్షలు తప్పవని, నిర్మల్ పోలీసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణలో కీలక ఆధారాలు సమర్పించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేశారని ఎస్పీ తెలిపారు.












