కుబీర్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 03
కుబీర్ మండలం చొండి గ్రామ సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు గేదెలు మృతి చెందాయి. ప్రమాదానికి గురైన కారులో టేకు బల్లలు ఉండటంతో కలప రవాణాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.
గేదెల మృతితో వెలుగులోకి టేకు కలప వ్యవహారం..! - టేకు బల్లలతో కారు.. మూడు గేదెలు మృతి - ప్రమాదం కంటే కలప రవాణాపైనే చర్చ.. అనుమతులపై - కేసు నమోదు చేయని ఫారెస్ట్ అధికారులు - కుబీర్ మండలం చొండి గ్రామ సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. కారు ఢీకొనడంతో మూడు గేదెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆవు తీవ్రంగా గాయపడింది. ప్రమాదంలో కారు దెబ్బతినడంతో అందులో టేకు బల్లలు ఉండటం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రమాదానికి గురైన వాహనంలో టేకు కలప ఎందుకు ఉంది? ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? కలప రవాణాకు అనుమతులు ఉన్నాయా? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమయ్యాయి.ఈ ఘటనపై ఎస్ఐ కృష్ణారెడ్డి స్పందిస్తూ ప్రమాదానికి గురైన కారులో టేకు బల్లలు ఉన్నట్లు తెలిపారు. అనంతరం అటవీ శాఖ బైంసా రేంజ్ ఆఫీసర్ రాథోడ్ రమేష్ ను వివరణ కోరగా కలపను తరలించేందుకు అవసరమైన అనుమతులు లేవని వెల్లడించారు. దీంతో టేకు కలప రవాణా వ్యవహారం మరింత అనుమానాస్పదంగా మారింది. అనుమతులు లేవని అధికారులు గుర్తించినప్పటికీ ఇప్పటివరకు కేసు నమోదు కాకపోవడంపై స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదంలో మూగజీవాలు ప్రాణాలు కోల్పోవడం ఒకవైపు విషాదాన్ని మిగల్చగా, అదే వాహనంలో టేకు బల్లలు బయటపడటం మరోవైపు చర్చనీయాంశమైంది. కలప రవాణాపై అటవీశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, వాహనం ఎక్కడి నుంచి వచ్చింది, కలపను ఎక్కడికి తరలిస్తున్నారు, ఎవరి ఆధ్వర్యంలో రవాణా జరుగుతోందన్న వివరాలను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు లేకుండా కలప తరలింపు జరిగితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.












