భైంసా, 14 July
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో డబ్బుల వివాదంతో స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. పోలీసులు కేసును ఛేదించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలు కీలకంగా మారాయని ఏఎస్పీ పత్తిపాక సాయి కిరణ్ తెలిపారు.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇటీవల ఎన్. ఆర్ గార్డెన్ సమీపంలోని బ్రిడ్జి కింద ఓ వ్యక్తి విగతజీవిగా పడి ఉండగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును ఛేదించారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలను మంగళవారం ఏఎస్పీ పత్తిపాక సాయి కిరణ్ మీడియాకు వెల్లడించారు.
నయా ఆబాదికి చెందిన నసీర్ అహ్మద్ (27)ను అతని స్నేహితుడు మొహమ్మద్ సఫ్రాన్ అహ్మద్ (19) హత్య చేసినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. గతంలో జరిగిన డబ్బుల వివాదం కారణంగా నసీర్ గ్యారేజీలో ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుందని, నిందితుడు అక్కడ ఉన్న రెండు సుత్తులతో నసీర్ అహ్మద్ తలపై పలుమార్లు దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.
నేరాన్ని దాచిపెట్టేందుకు మృతదేహాన్ని ఐరన్ మెషిన్ బాక్స్‌లో ఉంచి, మోటార్‌సైకిల్‌పై తీసుకెళ్లి ఆటోనగర్ చోటా బ్రిడ్జి సమీపంలోని మురికి కాలువలో పడవేసినట్లు పోలీసులు వెల్లడించారు. సఫ్రాన్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, దర్యాప్తులో సేకరించిన శాస్త్రీయ, సాంకేతిక ఆధారాల ఆధారంగా నేరంలో అతని ప్రమేయం నిర్ధారణ అయినట్లు తెలిపారు.
ఈ కేసు ఛేదనలో సీసీటీవీ ఫుటేజీలు, డిజిటల్ సాక్ష్యాలు, శాస్త్రీయ ఆధారాలు కీలక పాత్ర పోషించాయని, కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని భైంసా ఏఎస్పీ మరియు టౌన్ ఇన్స్పెక్టర్ మీడియా సమావేశంలో తెలిపారు.











