కరీంనగర్, జూలై 28 - ఆగస్టు 3
తల్లిదండ్రులే మనకు ప్రత్యక్ష దైవాలని, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక అధ్యక్షులు నేదునూరి కనకయ్య అన్నారు. జాతీయ తల్లితండ్రుల వారోత్సవాల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తల్లిదండ్రులే మనకు ప్రత్యక్ష దైవాలని, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక అధ్యక్షులు నేదునూరి కనకయ్య అన్నారు. జాతీయ తల్లితండ్రుల వారోత్సవాల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అమ్మ, నాన్న లేనిదే జన్మ లేదని, వారే మన ప్రేమమూర్తులని, మన భవితకు విధాతలని కనకయ్య పేర్కొన్నారు. తల్లిదండ్రుల ప్రేమ పవిత్రమైనదని, వారు త్యాగానికి నిదర్శనమని, పిల్లలు వారి సంరక్షణలో సుగంధ మల్లెల్లా ఎదుగుతారని తెలిపారు. అమ్మ నడక నేర్పిస్తే, నాన్న నడతను బోధిస్తారని, మన ఉజ్వల భవిష్యత్తు కోసం వారు అలుపెరుగని శ్రామికులని, మన బంగారు భవితకు బాట వేసేవారని అన్నారు.
తల్లిదండ్రులను అనాధ ఆశ్రమాలకు పంపవద్దని, వారికి ఆత్మీయత, ఆదరణ అందించాలని కనకయ్య సూచించారు. ఆస్తుల కోసం హత్యలు వంటివి చేయవద్దని హితవు పలికారు. తల్లిదండ్రులు అనుభవాల నిధులని, మమత, సమత, క్షమత, ఆర్ధతలకు అడ్డా అని తెలిపారు. కార్పొరేట్ చదువులు కరెన్సీ విలువను పెంచినప్పటికీ, మానవీయ విలువలను మరిచిపోకూడదని, మంచితనానికి తల్లితండ్రులే అంబాసిడర్లని అన్నారు.
అనుభవాన్ని రంగరించి, ఎంచుకున్న రంగంలో రాణించడానికి తల్లిదండ్రులు ఊతంగా నిలుస్తారని, ఉన్నంతలో ఉన్నతిని చాటుతూ, సంతృప్తి, సంతోషమే జీవన శైలిగా బతుకులు సాగించాలని సూచించారు. యువతకు భరోసా, భద్రత, మనోనిబ్బరాన్ని మాటలతో అందిస్తూ, చేతులతో ఆదరిస్తారని, జీవిత పోరాటంలో మెళుకువలు నేర్పగలరని తెలిపారు. ఎంజాయ్ చేసే సమయం వారికి లేకున్నా, తమ సమయమంతా మనకే సమర్పించే సహనం, అనుభవ సారం పంచుతారని, మన అభివృద్ధికి బాట వేస్తారని అన్నారు.
రాలిపోయే పూవులైనా కీర్తి ప్రతిష్టలు వెదజల్లుతాయని, వంశ పారంపర్యంతో సంతానం ప్రతిష్టను పెంచే ప్రచారకర్తలుగా ఉంటారని, రాలిపోయే తారలైనా కాంతి పుంజాలై వెలుగునిస్తారని కనకయ్య పేర్కొన్నారు. చివరిగా, కనిపెంచిన దైవాలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎకనామిక్ ఫోరం, తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం కరీంనగర్ ప్రతినిధులు పాల్గొన్నారు.











