నిజామాబాద్, ఆగస్టు 4
మత దురహంకారం, కుల వివక్షత, సామాజిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణానికి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా బాధ్యుడు మసాయిపేట యాదగిరి మాదిగ పిలుపునిచ్చారు. నిజామాబాద్ పట్టణంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నిజామాబాద్, ఆగస్టు 4 (మనోరంజని తెలుగు టైమ్స్): పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మత దురహంకారం, కుల వివక్షత, సామాజిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణానికి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా బాధ్యుడు మసాయిపేట యాదగిరి మాదిగ పిలుపునిచ్చారు.
నిజామాబాద్ పట్టణంలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ పట్టణ బాధ్యుడు సరికేల పోశెట్టి మాదిగ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా మసాయిపేట యాదగిరి మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడు దశాబ్దాలుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో రాజీలేని పోరాటాలతో ఎస్సీ వర్గీకరణ సాధించడమే కాకుండా మాదిగలతో పాటు పేద వర్గాల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి పలు సంక్షేమ ఫలితాలు సాధించామని అన్నారు.
ప్రజల సమస్యలను గుర్తించి బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని ఆయన సూచించారు. దేశంలో కుల వివక్ష కారణంగా అణగారిన వర్గాలు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నాయని, వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం ఉద్యమాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
రాజకీయ చైతన్యాన్ని పెంపొందిస్తూ గ్రామ స్థాయిలో అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీతో పాటు అన్ని అనుబంధ విభాగాల పాత కమిటీల స్థానంలో గ్రామాలు, పట్టణాలు, బస్తీల్లో నూతన కమిటీలను ఏర్పాటు చేసి సంస్థాగతంగా ఉద్యమాన్ని మరింత శక్తివంతం చేయాలని సూచించారు.
విద్యార్థులు, యువతను ఉద్యమంలో భాగస్వాములను చేసి భవిష్యత్తు తరాన్ని సామాజిక చైతన్యంతో ముందుకు నడిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సహాయ బాధ్యులు పేదిగిరి మహేష్, తెడు గంగారాం, రేణిగుంట నాంపల్లి, జిల్లా మహిళా నాయకురాలు గుంట పద్మ, రాహుల్, రాజేష్, నవీన్, యాదగిరి, గ్రామీణ బాధ్యుడు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.










