నిజామాబాద్‌లో యువకుల హల్చల్: తల్వార్‌తో రోడ్డుపై బర్త్‌డే వేడుకలు
మధ్యరాత్రి మద్యం మత్తులో యువకుల ఆగడాలు – పోలీసులు హెచ్చరిక
నిజామాబాద్, జూలై 29 (M4News):
నిజామాబాద్‌లో యువకులు మధ్యరాత్రి సృష్టించిన హల్చల్ స్థానికంగా కలకలం రేపింది. ఓ యువకుడి పుట్టిన రోజు వేడుకను రోడ్డు మీదే జరుపుకుంటూ… చేతిలో తల్వార్ పట్టుకొని హంగామా చేసిన ఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బర్త్ డే పేరుతో మద్యం సేవించి రోడ్డు మీద గుంపుగా గుమిగూడటం, పెద్దశబ్దాలతో కేక్ కట్ చేయటం, తల్వార్ ఊపుతూ సందడి చేయడం స్థానికుల్లో భయాందోళనకు గురి చేసింది.
ఈ నేపథ్యంలో పోలీసులు స్పందిస్తూ, ఇప్పటికే జిల్లా క్రైమ్ రేటు తగ్గించేందుకు సిటీ పోలీస్ కమిషనర్ స్పెషల్ యాక్షన్ ప్లాన్ రూపొందించారని తెలిపారు. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్, రాత్రి వేళ గుంపుగా గుమిగూడటం, నకిలీ ఆయుధాలతో హంగామా చేస్తే నేరుగా జైలుకే పంపుతామని అధికారులు స్పష్టం చేశారు.
అత్యవసరమైతే బాండ్లు రద్దు చేసి నిర్బంధించడానికీ సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ప్రజలు సంయమనం పాటించాలని, ఇలాంటి హంగామాలు తక్షణమే నివారించాలని పోలీసులు సూచించారు.