నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఆడెల్లి పోచమ్మ ఆలయ ప్రాంగణంలో ఆదివారం పిడుగుపాటు ఘటనలో ఇద్దరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం అందూర్ గ్రామానికి చెందిన గోడం గంగాధర్ (45), గోడం స్రవంతి (18) అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆకస్మికంగా కురిసిన వర్షం, ఉరుములు, మెరుపుల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని చెట్టు వద్ద నిలబడగా, చెట్టుపై పడిన పిడుగు ప్రభావంతో వారు స్పృహ కోల్పోయారు.
వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది, స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది వారికి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఆలయానికి వచ్చిన భక్తుల్లో భయాందోళనలు సృష్టించింది. వర్షాకాలంలో మెరుపులు, ఉరుములు సంభవించినప్పుడు చెట్ల కింద ఉండటం ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు.












